దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘డీసీ’ సినిమాపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ కోసం మొదట టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను సంప్రదించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ‘డీసీ’ చిత్రంలో వామిక గబ్బీ హీరోయిన్‌గా నటించగా, ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
గతంలో విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ తనకు ఒక కథ చెప్పారని, ఆ స్టోరీ నచ్చినప్పటికీ తాను చేస్తున్న ఇతర సినిమాల జోనర్‌లాగే ఉండటంతో ఆ ప్రాజెక్ట్ చేయలేదని తెలిపారు. దీంతో అరుణ్ మాథేశ్వరన్ విజయ్‌కి చెప్పిన ఆ కథ ‘డీసీ’నే అయి ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే, దీనిపై విజయ్ గానీ, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ చిత్రంలో రష్మికతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అలాగే రవి కిరణ్ కొల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన’ చిత్రంలో కీర్తి సురేశ్‌తో కలిసి విజయ్ నటిస్తుండగా, ఇది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ శౌర్యువ్‌తోనూ విజయ్ ఓ కొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు.
