- Advertisement -

12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్ కౌంట‌ర్!

- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దారుణ ఘటనకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన ప్రధాన నిందితుడు పోలీసుల ఎదురుకాల్పుల్లో (ఎన్‌కౌంటర్) హతమయ్యాడు. రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని చోలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫతేపూర్ జదౌన్ గ్రామానికి చెందిన మోనుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక గులాథీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు నిత్యం నిర్వహించే వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఆ సమయంలో బైక్‌పై వేగంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను చూడగానే భయపడిన వారు ఎలాంటి హెచ్చరికలకు లొంగకుండా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు.

ఈ కాల్పుల హోరులో ప్రధాన నిందితుడు మోను తీవ్రంగా గాయపడ్డాడు. అదే బైక్‌పై ఉన్న రెండో వ్యక్తి మాత్రం అదను చూసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన మోనును పోలీసులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, ఈ ఎదురుకాల్పుల ఘటనలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సందీప్‌కుమార్, కానిస్టేబుల్ నరేంద్రకుమార్‌లకు కూడా గాయాలయ్యాయి.

గత ఆగస్టు 1న జరిగిన 12 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో ఈ మోనునే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలను రగిలించింది. నిందితుడి దారుణ కృత్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో, అతడి ఆచూకీ కోసం పోలీసు శాఖ గాలింపు చర్యలను తీవ్రతరం చేసింది. అంతేకాకుండా పరారీలో ఉన్న మోను ఆచూకీ తెలిపిన వారికి డీఐజీ రూ. 50 వేల రివార్డు కూడా ప్రకటించారు. తాజాగా పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో ఎదురుకాల్పులు జరగడం, అందులో నిందితుడు హతంకావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పరారైన రెండో నిందితుడి కోసం పోలీసు బలగాలు గాలింపును మరింత ముమ్మరం చేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -