- Advertisement -

అమెరికాలో చంపి.. అగ్రాలో అరెస్ట‌య్యాడు!

- Advertisement -

అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్‌ యువతి నిఖిత (27) కేసులో ఎట్టకేలకు కీలక పురోగతి సాధించారు. దాదాపు ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్న నిందితుడు అర్జున్‌శర్మ (27) పోలీసులకు చిక్కాడు. మృతురాలి బ్యాంకు ఖాతాలోని నగదును బదిలీ చేసుకోవడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన నిఖిత ఉన్నత చదువుల (ఎంఎస్‌) కోసం 2022లో అమెరికా వెళ్లారు. అక్కడ ఆమెకు చెన్నైకి చెందిన అర్జున్‌శర్మ పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కొన్నిరోజులు మేరీల్యాండ్‌లోని ఒకే ఇంట్లో అద్దెకు ఉన్నారు. 2024లో నిఖితకు మంచి ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో తన ఉద్యోగం పోయిందంటూ అర్జున్‌శర్మ, అతడి తల్లి రచనాశర్మ కలిసి నిఖితను నమ్మించారు. ఆమెకు మాయమాటలు చెప్పి పెద్దఎత్తున డబ్బులు అప్పుగా తీసుకున్నారు.

గత ఏడాది డిసెంబరు చివరి వారంలో అర్జున్‌శర్మ తాను తీసుకున్న డబ్బులు తిరిగిస్తానని చెప్పి నిఖితను కొలంబియాలోని తన అపార్ట్‌మెంటుకు పిలిపించాడు. అక్కడ ఆమెపై కత్తితో కిరాతకంగా దాడి చేసి గదిలో బంధించాడు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన నిఖిత కనిపించడం లేదంటూ మేరీల్యాండ్‌ పోలీసులకు తానొక తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే భారతదేశానికి పారిపోయి వచ్చాడు. నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అక్కడి పోలీసులు జనవరి 3న అతడి అపార్ట్‌మెంటులో తనిఖీలు చేపట్టగా, అక్కడ నిఖిత విగతజీవిగా పడిఉన్న మృతదేహం లభించింది. డిసెంబరు 31నే ఈ హత్య జరిగినట్లు గుర్తించిన అమెరికా పోలీసులు, లాలాగూడలోని ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

భారత్‌కు వచ్చిన అర్జున్‌శర్మ తన నేరాన్ని ఆపలేదు. నిఖిత ఫోన్‌ నంబరు, డెబిట్‌కార్డును ఉపయోగించి ఆమె బ్యాంకు ఖాతాలోని నగదును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. ఈ లావాదేవీలను గమనించిన ఆమె తండ్రి ఆనంద్‌ ఏప్రిల్‌ 16న లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్‌ రవికిరణ్, ఎస్సై విజయ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు యూపీలోని ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించారు.

ఈ నెల 24న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి రిమాండ్‌ విధించడంతో అధికారులు అతడిని తిహాడ్‌ జైలుకు తరలించారు. తన కూతురు హత్యకు ఎలాంటి ప్రేమ వ్యవహారం కారణం కాదని, కేవలం ఆర్థిక లావాదేవీల కోణంలోనే ఈ హత్య జరిగిందని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని, నిందితుడికి సహకరించిన అర్జున్‌శర్మ తల్లిని కూడా విచారించాలని ఆయన కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -