- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం!

- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మారుతున్న సమీకరణాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెక్‌ పెట్టేందుకు ప్రత్యర్థి డీఎంకేతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్‌) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీవీకేకు వ్యతిరేకంగా తమ కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పిన ఆయన, ఏకంగా ‘డీఎంకే వస్తుందా?’ అంటూ నేరుగా సవాల్‌ విసరడం హాట్‌ టాపిక్‌గా మారింది.

తమిళనాడులో టీవీకేకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పడుతోందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఈపీఎస్‌ స్పందించారు. తాము కూడా టీవీకేకు వ్యతిరేకమేనని స్పష్టం చేస్తూ, ఇప్పటికే ఉన్న తమ కూటమి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ఇతర పార్టీలు తమతో కలిసి రావాలనుకుంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో డీఎంకేను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు టీవీకే కూటమి, డీఎంకే ఫ్రంట్, అన్నాడీఎంకే కూటమి మధ్య త్రిముఖ పోరులా మారుతున్న తరుణంలో ఈపీఎస్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు విజయ్‌ ప్రభుత్వంపై ఈపీఎస్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ధరల పెరుగుదల, శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్‌ సమస్య నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రజా సమస్యలపై సీఎం విజయ్‌ నేరుగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.

ఇప్పటికే అసెంబ్లీ వేదికగా విజయ్‌కు, డీఎంకే పార్టీకి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాజీ డీఎంకే ప్రభుత్వంపై సీఎం విజయ్‌ నేరుగా అవినీతి ఆరోపణలు చేయడంతో డీఎంకే సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా తీవ్ర శత్రువులుగా ఉన్న డీఎంకే-అన్నాడీఎంకే పార్టీలు, ఇప్పుడు టీవీకేను ఎదుర్కొనేందుకు ఒకే తాటిపైకి వస్తాయా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈపీఎస్‌ వ్యాఖ్యలు నిజంగానే పొత్తుకు సంకేతాలా లేక రాజకీయ వ్యూహమా అనేది త్వరలోనే తేలనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -