రాకా.. అవతార్‌ను మించిన విజువల్స్!

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ‘రాకా’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి ఈ సినిమాపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాపై అంచనాలను ఆయన మరింత పెంచేశారు.

సినీరంగంలో విజువల్ వండర్ అనగానే అందరికీ హాలీవుడ్ చిత్రం ‘అవతార్‌’ గుర్తుకొస్తుంది. అయితే ‘అవతార్‌’ సినిమాలోని విజువల్స్‌ను మించి ‘రాకా’లో అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయని శిబి చక్రవర్తి అన్నారు. భారతీయ సినీరంగానికి ఎంతో గర్వకారణంగా నిలిచే సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నారని ప్రశంసించారు. అట్లీ స్వయంగా తనకు ఈ చిత్రానికి సంబంధించిన విజువల్స్ చూపించారని తెలిపారు. ‘అవతార్’ సినిమాలో కూడా తాను అంత గొప్ప విజువల్స్ చూడలేదని, వాటిని వర్ణించడానికి మాటలు సరిపోవని కొనియాడారు.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రామమౌళి భారతీయ సినిమాను ఏ విధంగా అయితే గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారో, అట్లీ కూడా ‘రాకా’ సినిమాతో మన ఇండస్ట్రీని ప్రపంచం ముందు మరింత ఎత్తులో నిలబెడతారని ఆయన అన్నారు. అట్లీ శిష్యుడిగా ఉండటం తనకు ఎంతో గర్వకారణమని శిబి చక్రవర్తి పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లోనే ప్రేక్షకులకు ఆ అద్భుతమైన విజువల్స్ చూసే అవకాశం లభిస్తుందని ఆయన హింట్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే, ‘రాకా’ చిత్ర బృందం వరుస పోస్టర్లతో అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపుతోంది. రెండు రోజుల క్రితం ‘37’ అని రాసి ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా మరో కొత్త వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘పరిమితులు దాటి ఆలోచించాం.. లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాం.. ఊహించిన దానికంటే ఎంతో ఎత్తుకు వెళ్లాం’’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సంకేతాలు ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.