ఫహాద్‌ ఫాజిల్ సినిమాకు బాలకృష్ణ వాయిస్‌!

మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. టాలెంటెడ్ డైరెక్టర్ శశాంక్ యేలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో పాటు ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సారా పాలేకర్‌, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. నందమూరి అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం కావడం విశేషం. బాలయ్య వాయిస్ ఓవర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ట్రైలర్‌లోని విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలాఉంటే, ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం మరో విశేషం. రాజమౌళి సమర్పణలో వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఫహాద్ ఫాజిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.