దశాబ్దాలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నిషేధిత 22ఏ జాబితా సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా కాలంగా 22ఏ జాబితాలో కొనసాగుతున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, వివేక్ సమావేశమయ్యారు. 22ఏ పరిష్కారాలపై కీలక చర్చలు జరిపిన అనంతరం రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో హైదరాబాద్, పరిసర జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 కాలనీల్లోని 1.41 లక్షల ఇళ్లు, ప్లాట్లకు విముక్తి లభించనుంది. రంగారెడ్డి జిల్లాలో 44, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 65 కాలనీలు ఉన్నట్లు సమాచారం. గతంలో కోర్టు తీర్పులు, భూముల వేలం, క్రమబద్ధీకరణల సమాచారం రికార్డుల్లో అప్డేట్ కాకపోవడంతో ఇవి ప్రభుత్వ భూముల జాబితాలో ఉండిపోయాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఆందోళన చెందారు. ప్రభుత్వం ఈ సమస్యను ప్రత్యేకంగా గుర్తించి మొత్తం 12 రకాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి అనుమతులు పొందిన ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్లకు నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారు. దరఖాస్తుదారులు చట్టబద్ధమైన అనుమతి పత్రాలు, ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ సమర్పించడం తప్పనిసరి. ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోర్టు కేసుల్లో ఉన్న అంశాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
అనేక ఏళ్లుగా వేధిస్తున్న 22ఏ సమస్యను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించినట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కాలనీల క్రమబద్ధీకరణకు జీవో 118, సింగరేణి కార్మికుల ఇళ్ల కోసం జీవో 76 ఇప్పటికే జారీ చేశామన్నారు. భూమి స్వభావం, రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సత్వర పరిష్కారం చూపుతామని మంత్రి పేర్కొన్నారు.

