టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తన చివరి మెగా టోర్నీ అని స్పష్టం చేశాడు. దేశం తరఫున ఆడే ఆఖరి ప్రపంచకప్ ఇదేనని తెలిపాడు. ఆ ట్రోఫీని కైవసం చేసుకోవడమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నాడు. ఇందుకోసం మైదానంలో తన సర్వశక్తులూ ధారపోస్తానని వెల్లడించాడు.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లీ మాట్లాడాడు. ‘జియోస్టార్’తో తన మనసులోని మాటలను పంచుకున్నాడు. వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా 2027 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచకప్ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో తీవ్రత మరే ఇతర టోర్నమెంట్లోనూ ఉండదని కోహ్లీ వివరించాడు. ఇందులో దాదాపు 10 మ్యాచ్‌లను టీ20 స్థాయి ఇంటెన్సిటీతో ఆడాల్సి ఉంటుందన్నాడు. ఒక్కో వన్డే మ్యాచ్ రెండున్నర టీ20లతో సమానమని చెప్పాడు. మెగా ఈవెంట్లో వరుసగా పది మ్యాచ్‌ల పాటు ఆ తీవ్రతను కొనసాగించడం చాలా పెద్ద సవాలు అని పేర్కొన్నాడు.
మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఆలోచనలను పంచుకున్నాడు. తాను చేయాల్సిన పని పూర్తయిందనే భావన ఎప్పుడూ కలగలేదన్నాడు. ఆడుతున్నంత కాలం సరికొత్త లక్ష్యం కోసం ఆటగాళ్లు ఎదురుచూస్తూనే ఉంటారని చెప్పాడు. తాను కూడా ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
ఐసీసీ టోర్నీలలో వేర్వేరు ప్రత్యర్థులను వేర్వేరు వేదికలపై ఎదుర్కోవాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవాలని పేర్కొన్నాడు. కొత్తగా ఆలోచించి విభిన్నంగా సిద్ధం కావడమే అసలైన సవాలు అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి తాజా ప్రకటనలతో రాబోయే వన్డే ప్రపంచకప్ వరకు ఈ సీనియర్ ద్వయం కొనసాగుతుందా లేదా అనే సందేహాలకు పూర్తిగా తెరపడింది.

