తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం అధికారులు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గాల్లో ఈ నమోదు కొనసాగనుంది. ఈ రెండు స్థానాల ప్రస్తుత పదవీ కాలం 2027 మార్చితో ముగియనుంది.
ఈ ఏడాది నవంబరు 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన వారు ఫారం-18 పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. నవంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. డీఈవో, ఈఆర్వో, ఏఈఆర్వోల కార్యాలయాల వద్ద ఈ ఫారాలు అందుబాటులో ఉంటాయి. పోస్టు ద్వారా కూడా అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తారు.
పట్టభద్రులు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ ceotelangana.nic.in ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో ఫారం-18 నింపిన తర్వాత, ఆ కాపీని ప్రింట్ తీసుకుని స్థానిక ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తు పత్రాలు జిల్లాలకు చేరడానికి మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఓటర్లను భారీ సంఖ్యలో నమోదు చేయించేందుకు ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నాయి. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అర్హులైన డిగ్రీదారులను గుర్తిస్తున్నాయి. మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లతో శిబిరాలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేయిస్తున్నాయి.
మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు సైతం అర్హులైన టీచర్లను గుర్తించి ఓటర్లుగా చేర్పించే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీంతో అధికారులు ఓటర్ల నమోదు ప్రక్రియకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

