ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వినోద సాధనంగానే కాకుండా లక్షలాది మందికి ఇది ప్రధాన జీవనాధారంగా మారింది. 2025లో భారత జీడీపీకి యూట్యూబ్ రూ.18,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చిందని ‘ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్’ నివేదిక స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా యూట్యూబ్ ఏకంగా 9.6 లక్షలకు పైగా ఫుల్‌టైమ్ ఉద్యోగాలను సృష్టించింది. దాదాపు 73 శాతం మంది కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఛానెళ్ల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 30 శాతం మేర పెరిగింది. పది లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్న భారతీయ ఛానెళ్ల సంఖ్య 18 వేల మైలురాయిని దాటింది.
కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ యూట్యూబ్ ప్రభావం కనిపిస్తోంది. జైపుర్, లఖ్‌నవూ వంటి పట్టణాల్లో ప్రత్యేకంగా క్రియేటివ్ హబ్‌లు ఏర్పడ్డాయి. వీటి ద్వారా స్థానిక వీడియో ఎడిటర్లు, కెమెరామెన్లు, స్క్రిప్ట్ రైటర్లకు పుష్కలంగా ఉపాధి లభిస్తోంది. భారతీయ క్రియేటర్లు రూపొందిస్తున్న కంటెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. మొత్తం వాచ్టైమ్లో 15 శాతానికి పైగా వీక్షణలు విదేశాల నుంచే వస్తున్నాయి.
ప్రాంతీయ భాషల కంటెంట్‌కు అంతర్జాతీయంగా వీక్షకుల సంఖ్య భారీగా పెరిగినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. గతేడాది భారతీయ క్రియేటర్లు సుమారు 16 కోట్ల గంటలకు పైగా నిడివి గల వీడియోలను అప్లోడ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కూడా యూట్యూబ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు ‘క్రియేట్ విత్ ఏఐ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత జానపద, గిరిజన సంగీతాన్ని ప్రపంచ స్థాయికి చేర్చేందుకు సాంస్కృతిక శాఖతో కలిసి పనిచేస్తోంది. క్రియేటర్ల పనిని మరింత సులభతరం చేసేందుకు ఆస్క్ స్టూడియో, కన్వర్జేషనల్ ఏఐ ఎడిటింగ్ వంటి అత్యాధునిక ఏఐ టూల్స్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

