ఫహాద్ నాకు స్ఫూర్తినిచ్చారు: ఎన్టీఆర్‌

ఫహాద్‌ ఫాజిల్‌ భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు అని జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రశంసించారు. ఫహాద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డోంట్‌‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. ఈ సినిమా అక్టోబరు 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఎన్టీఆర్, ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ఫహాద్‌ నటనపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ‘బెంగళూరు డేస్‌’ సినిమా నుంచే ఫహాద్‌తో తన సినీ ప్రయాణం మొదలైందన్నారు. కోవిడ్ సమయంలో ఆయన నటన అందరి ఇళ్లలోకి చేరిందని చెప్పారు. ఒక నటుడిగా ఫహాద్‌ తనకు ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చారని ఎన్టీఆర్‌ అన్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేక విజయంగా నిలవాలని కోరుకున్నారు.

తన వ్యక్తిగత, సినీ విషయాలను కూడా ఎన్టీఆర్‌‌ పంచుకున్నారు. తన చేతి గాయం ఇప్పుడు పూర్తిగా నయమైందని చెప్పారు. త్వరలోనే ‘డ్రాగన్‌’ షూటింగ్‌ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఈ సినిమా అనుకున్న తేదీకే విడుదలవుతుందని తెలిపారు. దర్శకుడు శశాంక్‌ ఏలేటి తన కలను నిజం చేసుకుని దర్శకుడిగా మారడాన్ని అభినందించారు.

తన కెరీర్ ఆరంభ రోజులను ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ ఓపెనింగ్ రోజున ఎవరూ తోడు లేక బాధపడ్డానని చెప్పారు. ఆ లోటును అభిమానులే పూడ్చి తనకు వెన్నెముకగా నిలిచారని తెలిపారు. రాజమౌళి, కీరవాణి తనకు దేవుడిచ్చిన కుటుంబమని పేర్కొన్నారు. ‘స్టూడెంట్‌ నెం.1’ విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేదికపై సంతోషం వ్యక్తం చేశారు.

నిర్మాత ఎస్‌.ఎస్‌.కార్తికేయను తన సొంత తమ్ముడిగా భావిస్తానని ఎన్టీఆర్ అన్నారు. తన కష్టసుఖాల్లో కార్తికేయ ఎప్పుడూ తోడుగా ఉన్నాడని తెలిపారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల వెనుక కార్తికేయ శ్రమ ఎంతో ఉందని చెప్పారు. నిర్మాతగా కార్తికేయ మొదటి ప్రయత్నం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, దెయ్యాన్ని కిడ్నాప్‌ చేసే వినూత్న కథతో ఈ చిత్రం తెరకెక్కిందన్నారు. పూర్తి స్క్రిప్ట్‌ విన్నాక వెంటనే ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలిపానని వెల్లడించారు. ఈ సినిమాలో ఫహాద్‌తో పాటు బేబీ సారా కూడా అద్భుతంగా నటించిందని చెప్పారు. ‘పుష్ప’ తర్వాత పూర్తిస్థాయి తెలుగు చిత్రంతో వస్తున్నందుకు ఆనందంగా ఉందని ఫహాద్‌ పేర్కొన్నారు.