హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ యువ వైద్యురాలు దారుణ హత్యకు గురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన స్నేహితుడే పథకం ప్రకారం ఆమెను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి పట్టణం శాంతినగర్‌కు చెందిన భూమయ్య రెండో కుమార్తె డాక్టర్ కె.సృజన (27). ఆమె మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం హనుమకొండలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఏడేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెకు రవికుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా స్నేహంగా మారింది.
కొద్దిరోజుల క్రితం రవికుమార్ ఆమె వద్ద నుంచి ఓ బంగారు గొలుసు తీసుకున్నాడు. ఆ బంగారు గొలుసును తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. దీంతో సృజన గత నెల 30న హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చింది. రోజులు గడుస్తున్నా ఆమె హనుమకొండకు తిరిగి రాలేదు. స్నేహితురాళ్లు ఆమె ఫోన్‌కు పలుమార్లు కాల్ చేశారు. ఎంతకీ స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
తండ్రి హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టారు. సృజన చివరగా మియాపూర్ హఫీజ్‌పేట పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది.
గత నెల 29న రవికుమార్ అక్కడి ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. పోలీసులు ఆ గది తాళాలు తీసి చూడగా సృజన మృతదేహం కనిపించింది. దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రవికుమార్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. పథకం ప్రకారమే ఆమెను గదికి పిలిపించి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

