హైదరాబాద్ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగర ప్రజల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కూర్ (CURE) యాక్ట్ 2026’ను తీసుకువచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని సిటిజన్లకు మున్సిపల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడనుంది. ప్రజల ఇబ్బందిని పూర్తిగా తొలగించి, పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు. దీని ద్వారా నగర ప్రజలకు అందే ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం.

ఆటోమేటిక్ మ్యుటేషన్: ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు ఇకపై ఉండవు. ప్రతి ఆస్తికి ప్రత్యేకమైన ‘ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్’ కేటాయిస్తారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తికాగానే మ్యుటేషన్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.

ఒకే ఆస్తి.. ఒకే బిల్లు: ఆస్తి పన్ను, తాగునీటి బిల్లులు, డ్రైనేజీ చార్జీలు, శానిటేషన్ డ్యూస్ అన్నీ కలిపి ఇకపై ‘CURE-1’ పేరుతో ఒకే ఒక్క బిల్లుగా వస్తాయి. మున్సిపల్ సేవలు, పర్మిషన్లు, లైసెన్సులు అన్నీ ఒకే పోర్టల్ ద్వారా ఈజీగా పొందవచ్చు.

ప్రాపర్టీ ట్యాక్స్ పెంపుపై పరిమితి: ఆస్తి పన్ను అకస్మాత్తుగా విపరీతంగా పెరిగిపోకుండా ప్రభుత్వం రక్షణ కల్పించింది. వార్షిక పన్ను పెంపును గరిష్టంగా 10 శాతానికే పరిమితం చేశారు. ఉదాహరణకు ప్రస్తుతం రూ.10,000 ట్యాక్స్ కడితే, కొత్త చట్టం ప్రకారం మొదటి ఏడాది రూ.11,000 మించదు. అలాగే 375 చదరపు అపుల వరకు ఉండే చిన్న ఆస్తులకు కేవలం రూ.101 నామినల్ వార్షిక పన్ను మాత్రమే ఉంటుంది.

వేగవంతమైన బిల్డింగ్ పర్మిషన్లు: అనవసరమైన ఆలస్యాలకు చెక్ పెట్టేలా ఆన్‌లైన్ అప్రూవల్స్, టైమ్-బౌండ్ నిర్ణయాలు ఉంటాయి. పెండింగ్ అప్లికేషన్లు ఎస్కలేట్ అవ్వడంతో పాటు, నిర్ణీత గడువులోగా అనుమతులు రాకపోతే డీమ్డ్ అప్రూవల్ లభించే వెసులుబాటు కల్పించారు.

సులభమైన లైసెన్సులు.. బలమైన వ్యాపార అవకాశాలు: వ్యాపారాలు ప్రారంభించడానికి సింప్లిఫైడ్ లైసెన్సింగ్ విధానం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ‘నైట్-ఎకానమీ జోన్లు’ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ అర్బన్ ఎకానమీ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది.

చిన్న నిబంధనల ఉల్లంఘనకు సరళమైన విధానం: చాలా చిన్నపాటి ఉల్లంఘనలకు ఇకపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండవు. వాటి స్థానంలో సివిల్ పెనాల్టీలను ప్రవేశపెట్టారు. జరిమానాలు విధించే ముందు సంబంధిత వ్యక్తులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు.

ఆస్తి రిజిస్ట్రేషన్ నుంచి మున్సిపల్ సేవల వరకు, పన్నుల అంచనా నుంచి వేగవంతమైన అనుమతుల వరకు.. సీయూఆర్‌ఈ (CURE) యాక్ట్ హైదరాబాద్ ప్రజల దైనందిన జీవితాన్ని ఎంతో సులభతరం చేయనుంది. పౌరులకు వేధింపులు తగ్గించి, పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని స్పష్టమవుతోంది.