‘దృశ్యం’ సినిమా చూసి తండ్రి హత్య

బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భూ వివాదం కారణంగా శివశంకర్ (26) అనే యువకుడు కన్న తండ్రినే హతమార్చాడు. నేర కథాంశంతో వచ్చిన ‘దృశ్యం’ సినిమా చూసి అతడు ఈ హత్యకు పథకం వేశాడు. ఇందుకోసం నిందితుడు దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించాడు.

మృతుడు రఘువీర్ సాహ్ని (50) కుమారుడైన శివశంకర్‌తో విభేదాలు ఉన్నాయి. శివశంకర్ తన భార్యతో కలిసి గుజరాత్‌లోని సూరత్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ భూమి విక్రయం విషయంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో రఘువీర్ తన కుమారుడిని, కోడలిని దూషించాడు. ఈ అవమానాన్ని మనసులో పెట్టుకున్న శివశంకర్ తండ్రిపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

పథకం ప్రకారం శివశంకర్ తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. సూరత్ నుంచి ప్రయాణమై పట్నా సమీపంలోని పటోరీ మీదుగా అర్ధరాత్రి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక వైపు నుంచి ఆవరణలోకి ప్రవేశించాడు. అక్కడ ఆరుబయట నిద్రిస్తున్న తండ్రి రఘువీర్‌పై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హత్య పూర్తి కాగానే శివశంకర్ పటోరీ రైల్వేస్టేషన్ మీదుగా తిరిగి సూరత్‌కు పారిపోయాడు. తండ్రి మరణించినా అంత్యక్రియలకు హాజరు కాలేదు. దీంతో పోలీసులకు అతడిపై బలమైన అనుమానం వచ్చింది. పటోరీ రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి భార్యతో మాట్లాడాడు. ఆ తర్వాత 36 గంటలకు ఆ ఫోన్ లొకేషన్ సూరత్‌లో కనిపించింది. ఈ చిన్న తప్పిదం ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.