ఈజిప్టులోని గిజా ప్రాంతంలో ఓ అద్భుత సంఘటన వెలుగు చూసింది. భవనం బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయిన చిన్నారి ప్రాణాలను ఓ వ్యక్తి కాపాడాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడికి పునర్జన్మను ప్రసాదించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్థానికుడైన అహ్మద్ రగబ్ ఓ దుకాణం వెలుపల నిలబడి ఉన్నారు. ఆ సమయంలో వెనుక ఉన్న రెండంతస్తుల భవనం పైనుంచి అరుపులు, కేకలు వినిపించాయి. దుకాణంలో నుంచి వచ్చిన మరో బాలుడు పైనుంచి చిన్నారి పడిపోతున్న విషయాన్ని అహ్మద్‌కు చెప్పాడు.
వెంటనే అప్రమత్తమైన అహ్మద్ ఏమాత్రం ఆలోచించలేదు. క్షణాల వ్యవధిలోనే వేగంగా ముందుకు దూకాడు. గాల్లో నుంచి కింద పడుతున్న చిన్నారిని నేలకు తగలకుండా పట్టుకున్నాడు. దీంతో ఆ పసికందుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాలూకు సీసీటీవీ దృశ్యాలు తాజాగా బయటకు వచ్చాయి. సమయానికి స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడిన అహ్మద్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనను నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు.

