24 గంటల్లోనే యువనేత పెళ్లి.. పదవి కోసమేనా?

రాజకీయాల్లో పదవి కోసం నేతలు వేసే అడుగులు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వం మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీంతో ఆశావహుల లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది.

సాలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ యువనేత, మాజీ కౌన్సిలర్‌ వైకుంఠపు హర్షవర్ధన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవిని ఆశించారు. పట్టణంలో పార్టీ తరఫున గెలిచి పీఠం దక్కించుకోవాలని భావించారు. అయితే ప్రభుత్వం సోమవారం మున్సిపల్ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు కేటాయించబడింది. దీంతో హర్షవర్ధన్‌ నేరుగా పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

ఛైర్మన్ పీఠాన్ని ఎలాగైనా తమ కుటుంబంలోనే ఉంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్లు మహిళల కోటాలోకి వెళ్లడంతో వెంటనే ఓ వ్యూహం ఆలోచించారు. తను ప్రేమించిన యువతి మంజీరను పెళ్లాడాలని భావించారు. ఆమెను ఎన్నికల బరిలో నిలిపితే పదవిని దక్కించుకోవచ్చని లెక్కలేశారు.

వెంటనే రెండు కుటుంబాల పెద్దలతో మాట్లాడారు. వారిని ఒప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించారు. రిజర్వేషన్ల ప్రకటన వెలువడిన కేవలం 24 గంటల్లోనే మంగళవారం స్థానిక ఆలయంలో మంజీరతో ఆయన వివాహం ఘనంగా జరిగింది.

ఈసారి పట్టణ స్థానిక సంస్థల ఛైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. ప్రజలే నేరుగా ఓటు వేసి ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకుంటారు. దీంతో తన నూతన భార్య మంజీరకు తెదేపా తరఫున టికెట్‌ ఇప్పించేందుకు హర్షవర్ధన్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్‌ రాగానే క్షణాల్లో పెళ్లి పీటలెక్కిన ఈ యువనేత వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.