ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో భారతదేశంలో ఉపాధి రంగం తీవ్ర మార్పులకు లోనవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 19.5 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఆటోమేషన్ ప్రభావం పడనుంది. ఈ విషయాన్ని చెన్నైకి చెందిన ‘సెంటర్ ఫర్ ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్ రీసెర్చ్’ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని మొత్తం ఉద్యోగాల్లో సుమారు 24.6 శాతం కొలువులు ఏఐ పరిధిలోకి వస్తాయి.
ఈ ఆటోమేషన్ ప్రభావం పురుషుల కంటే మహిళా ఉద్యోగులపై అధికంగా ఉండనుంది. మహిళలు చేసే ఉద్యోగాల్లో 37.6 శాతం, పురుషులు చేసే ఉద్యోగాల్లో 28.4 శాతం ఏఐ వల్ల ప్రభావితమవుతాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళ 42 శాతంతో మొదటి స్థానంలో ఉంది. హర్యానా 37.9 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు 32.9 శాతంతో మూడో స్థానంలో ఉంది. అయితే, ఏఐ రాకతో దాదాపు 8 శాతం ఉద్యోగాల్లో పనితీరు, నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని నివేదిక తెలిపింది.
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా ఉంది. 15 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 1.87 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ముఖ్యంగా 20 నుంచి 29 ఏళ్ల యువతలో నిరుద్యోగిత రేటు రెట్టింపుగా ఉంది. దేశంలో దాదాపు 25 శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సరైన ఉపాధి దొరకడం లేదు.
పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 ఏళ్ల లోపు యువతలో 55 శాతం మంది సాధారణ, రొటీన్ పనుల్లోనే కొనసాగుతున్నారు. ఏఐ ఇలాంటి సాధారణ పనులను వేగంగా భర్తీ చేస్తోంది. అందుకే ఆటోమేషన్ సవాళ్లను తట్టుకోవడానికి యువత నూతన సాంకేతిక నైపుణ్యాలను వేగంగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

