5 నెల‌ల లివ్ ఇన్.. పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడు!

బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కలిసి జీవించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఒక యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం చేయాలని కోరుతూ ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

హాసన్‌ జిల్లాకు చెందిన సూర్య (26), కేరళకు చెందిన నిష్మ (26) బెంగళూరులోని ఒకే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆఫీసు పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. దాంతో గత ఐదు నెలలుగా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. మొదట్లో పెళ్లికి సూర్య తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత వారు మాట మార్చారు. మరోవైపు నిష్మ ఇంట్లో కూడా ఈ వివాహానికి వ్యతిరేకత ఎదురైంది.

ఈ క్రమంలో సెప్టెంబర్ 24న సూర్య తన ఫోన్‌ను అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో నిష్మ తట్టుకోలేకపోయింది. తీవ్ర వేదనతో పురుగుల మందు తాగింది.

ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేసింది. తన పరిస్థితికి సూర్య, అతని తల్లిదండ్రులు, స్నేహితుడు ప్రవీణ్ కారణమని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై మహాలక్ష్మి లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.