వైఎస్సార్ జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఘర్షణకు దారితీసింది. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు నేతలను సైతం ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు.
నామినేషన్ కేంద్రం పరిసరాల్లో పరిస్థితి వేడెక్కింది. నామినేషన్ సమయం ముగిసే వరకు అభ్యర్థులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తోందని వారు మండిపడ్డారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై దాడులు జరిగాయి, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రిక్తత మరింత పెరగడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. పోలీసుల చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ వర్గీయులు భారీగా మోహరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులకు యత్నించారని నేతలు ఆరోపించారు. ప్రత్యర్థులను వదిలేసి తమ పార్టీ శ్రేణులపైనే పోలీసులు ప్రతాపం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగాయి. దీంతో పులివెందులలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

