రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనపై గవర్నర్‌కు జగన్‌ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తీవ్ర అరాచకాలు జరుగుతున్నాయని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో ఆయన భేటీ అయ్యారు. గత మూడు రోజులుగా టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులు, హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు.

గవర్నర్‌ భేటీ అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలు ఓట్లు వేయరనే భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిది మున్సిపాలిటీల్లో నామినేషన్లు పడలేదని తెలిపారు. మరో ఎనిమిది చోట్ల నామినేషన్ పత్రాలను చించివేశారని చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పూర్తిగా చేతులెత్తేసిందని జగన్‌ ధ్వజమెత్తారు. స్థానిక మున్సిపాలిటీల్లోనే ఈ స్థాయి హింస ఉంటే, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌ లేదా సెంట్రలైజ్డ్‌ విధానంలో నిర్వహించాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎన్నికల విధులకు పారామిలటరీ బలగాలను రప్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. పులివెందులలో పోలీసుల కాల్పులు జరిగాయని, టీడీపీ దాడుల్లో పలువురు పార్టీ నేతలు గాయపడ్డారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడకుండా ధైర్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.