సిద్దిపేట జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. దసరా పండుగ రోజు తల్లిదండ్రులు లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక దసరా పండుగ నాడు ఇంట్లో ఉంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, నిందితులు ఆ బాలికను బలవంతంగా సమీపంలోని మరో గ్రామానికి అపహరించుకెళ్లారు. అక్కడ ఆ బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అంతటితో ఆగకుండా బాధితురాలను రాత్రంతా అక్కడే ఉంచుకుని, మరుసటి రోజు ఉదయం ఆమెను తిరిగి గ్రామ సమీపంలో వదిలి వెళ్లారు. కూతురు రాత్రంతా కనిపించకపోవడంతో ఆందోళన చెင်న తల్లిదండ్రులు ఇంటికి రాగానే గట్టిగా ఆరా తీశారు. దీంతో బాధితురాలైన బాలిక భయపడుతూనే జరిగిన దారుణాన్ని కన్నీటిపర్యంతమై తల్లిదండ్రులకు వివరించింది.
చేర్యాల పట్టణం, ధూల్మిట్ట గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

