ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేటలో సంచలనం సృష్టించిన లలితకుమారి మృతి కేసును పోలీసులు ఛేదించారు. అనుమానంతో భర్తే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ వివరాలను రాజాం టౌన్ సర్కిల్ సీఐ నవీన్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.
కొండంపేటకు చెందిన గుడివాడ సీతారామరాజుతో లలితకుమారికి 2003లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో లలితకుమారి విద్యుత్‌శాఖలో ఉద్యోగం సాధించారు. ఆమె మొదట వీరఘట్టంలో, ఆ తర్వాత రాజాం, చీపురుపల్లిలో పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా ఆమె సహచర ఉద్యోగులతో మాట్లాడటం భర్తకు నచ్చేది కాదు. ఆమె రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి రావడంతో భర్తలో అనుమానం పెరిగింది. దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి.
గొడవలు జరిగిన ప్రతిసారీ లలితకుమారి విశాఖపట్నంలోని పుట్టింటికి వెళ్లేది. పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ భర్త వద్దకు వచ్చి కాపురం చేసేది. ఆమె తన మాట వినడం లేదని భావించిన సీతారామరాజు ఆమెను హతమార్చాలని ముందే నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక గొడ్డలిని కొనుగోలు చేసి శ్మశానవాటిక సమీపంలోని తుప్పల్లో దాచాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పక్కా పథకం వేశాడు.
శనివారం రాత్రి మరోసారి దంపతుల మధ్య గొడవ జరిగింది. లలితకుమారి బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి బయలుదేరింది. బస్టాప్‌లో దింపుతానని చెప్పి సీతారామరాజు ఆమెను స్కూటీపై ఎక్కించుకున్నాడు. గొడ్డలి దాచిన ప్రదేశం వద్దకు రాగానే బండి ఆపాడు. అక్కడ మళ్లీ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తుప్పల్లో దాచిన గొడ్డలితో ఆమె తలపై బలంగా నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
మృతదేహాన్ని పక్కకు లాగేసి స్కూటీని రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదం జరిగినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరూ కలిసి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. నిందితుడి చేతికి రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించి విచారించగా నేరం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుపాలు కావడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

