కృతి సనన్ ను భ‌య‌పెడుతున్న‌దేంటో తెలుసా?

సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరిగిపోతుండటంపై బాలీవుడ్ ప్రముఖ నటి కృతి సనన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ మీడియా సమ్మిట్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దానిని కట్టడి చేసే చట్టాలు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదని ఆమె పేర్కొన్నారు. అసలైన ఫొటో ఏది, ఏఐ సృష్టించిన ఫొటో ఏది అని పోల్చుకోవడం రోజురోజుకూ కష్టంగా మారుతోందని తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో ఏఐ సాయంతో వచ్చే తప్పుడు చిత్రాలను అడ్డుకోవడం లేదా తొలగించడం పెద్ద సమస్యగా మారిందని కృతి చెప్పారు. ఇన్ స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తన పోలికలతో రూపొందించిన చిత్రాలను పోస్ట్ చేస్తే, వాటిని తొలగించేందుకు సరైన మార్గాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఇది ఏఐ సృష్టించిన నా నకిలీ చిత్రం, కాబట్టి తొలగించండి’ అని ఫిర్యాదు చేసే ప్రత్యేక ఆప్షన్ కూడా ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదని ఆమె గుర్తుచేశారు.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సామాజిక మాధ్యమాల నిబంధనలు ఇంకా మారలేదని కృతి సనన్ అభిప్రాయపడ్డారు. నిబంధనలను వేగంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తును తలచుకుంటే తనకు తీవ్రమైన భయం వేస్తోందని ఆమె తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని కృతి వ్యాఖ్యానించారు. సాధనం ఎంత పదునుగా ఉంటే సమాజానికి అంత ప్రమాదమని ఆమె హెచ్చరించారు. కొత్త సాంకేతిక ఆవిష్కరణలను తాను ఎప్పుడూ స్వాగతిస్తానని స్పష్టం చేశారు. అయితే వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత హక్కుల విషయంలో ఏఐ తెస్తున్న సవాళ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు.