బీర్ల కంపెనీలకు నీళ్లు.. రైతులకు కన్నీళ్లా..!

రైతుల పొలాలకు నీరందించకుండా మద్యం కంపెనీలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంటలకు సాగునీరు ఇవ్వకుండా బీర్ల కంపెనీలకు నీళ్లు తరలించడం దారుణమని ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి సర్కార్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

సింగూరు ప్రాజెక్టు పరిధిలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. నిండు కుండలా ఉన్న ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా ఎడారిగా మార్చేసిందని ధ్వజమెత్తారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో సింగూరు ఆయకట్టు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ప్రవీణ్‌ కుమార్‌, గోసుల శ్రీనివాస్‌, నేతలు అభిలాష్‌ రంగినేని, గౌతం ప్రసాద్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రశ్నించే ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని దుయ్యబట్టారు.

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జలసిరులతో పంటలు పండించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో మాత్రం రేవంత్‌ రెడ్డి క్రాప్‌ హాలిడే అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఒకరకమైన గురుదక్షిణ చెల్లించుకోవడమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు కేవలం మాటలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ధైర్యముంటే ఎండిన పంట పొలాల వద్దకు వెళ్లి రైతులకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

సీఎంవో ఇచ్చే స్క్రిప్టులను మాత్రమే నేతలు చదువుతున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన కాకుండా రేవంత్‌ భజనపరులుగా మారారని వ్యాఖ్యానించారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. బ్లాక్ మార్కెట్‌ను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని చెప్పారు. బహిరంగ మార్కెట్లో బియ్యం కిలో రూ.90కి, నూనె రూ.220కి చేరి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.