ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2026 విజేతల జాబితా విడుదలైంది. 26వ ఐఫా వేడుకల్లో బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ తిరుగులేని ఆధిపత్యం చాటింది. ప్రధాన విభాగాల్లో ఏకంగా 12 అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో అద్భుత నటన కనబరిచినందుకు గానూ రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. మరోవైపు ‘సైయారా’ చిత్రంలో నటనకు గానూ అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలిచారు.
‘ధురంధర్’ చిత్రం అత్యధిక విభాగాల్లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. దర్శకుడు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ డైలాగ్స్, ఉత్తమ ఒరిజినల్ కథ విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు. ఇందులో కీలక పాత్రలు పోషించిన సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా, అక్షయ్ ఖన్నా ఉత్తమ విలన్‌గా ఎంపికయ్యారు. శాశ్వత్ సచ్‌దేవ్‌కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది. వికాస్ నౌలఖా (సినిమాటోగ్రఫీ), శివకుమార్ వి. పనికర్ (ఎడిటింగ్), బిశ్వదీప్ ఛటర్జీ (సౌండ్ డిజైన్) సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించారు.
ఇతర చిత్రాలు కూడా పలు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో ప్రతిభ చూపాయి. ‘సైయారా’ చిత్రం సంగీత విభాగాల్లో మెరిసింది. ఇర్షాద్ కామిల్ ఉత్తమ గీత రచయితగా అవార్డు పొందారు. ఫహీమ్ అబ్దుల్లా ఉత్తమ నేపథ్య గాయకుడిగా, శ్రేయా ఘోషల్ ఉత్తమ నేపథ్య గాయనిగా నిలిచారు. ఇదే చిత్రంతో తెరంగేట్రం చేసిన అహాన్ పాండేకు ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడి పురస్కారం దక్కింది. ‘జాలీ ఎల్ఎల్బీ 3’ చిత్రంలో నటనకు గానూ హ్యూమా ఖురేషీ ఉత్తమ సహాయ నటి అవార్డును సొంతం చేసుకున్నారు.
చారిత్రక చిత్రం ‘ఛావా’ సాంకేతిక విభాగాల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌కు ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డు వచ్చింది. అలోక్ డే ఉత్తమ సౌండ్ మిక్సింగ్ పురస్కారం అందుకున్నారు. అసెంబ్లేజ్ ఎంటర్టైన్మెంట్, రీడిఫైన్ సంస్థలు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డును గెలుచుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ నిలిచింది. మొత్తంమీద ఈ ఏడాది ఐఫా వేడుకల్లో ‘ధురంధర్’ విజయకేతనం ఎగరేసింది.

