తమిళ సినీ నటుడు ధనుష్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారం జోరందుకుంటున్న సమయంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా కీలక అడుగులు వేస్తున్నారు. తమిళనాడు అంతటా సుమారు 3 వేల మంది న్యాయ సలహాదారులను నియమించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ధనుష్ తన అభిమాన సంఘాలను ఇప్పటికే సంక్షేమ సేవా సంఘాలుగా మార్చారు. వీటిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో ఉన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కొత్త నిర్వాహకులను నియమిస్తున్నారు. ఇందులో భాగంగానే పటిష్టమైన ఒక న్యాయ వ్యవస్థను కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. జిల్లాల వారీగా న్యాయ సలహాదారులను కేటాయించి ఒక నెట్‌వర్క్‌ను రూపొందించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నారు. ప్రజలు ఎదుర్కొనే నిత్య చట్టపరమైన సమస్యలకు ఉచిత సలహాలు ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. అలాగే సమాజంలో తలెత్తే వివిధ సమస్యలపై కూడా వీరు చట్టపరమైన మార్గదర్శకత్వం చేస్తారు. బలహీనులకు న్యాయపరమైన అండగా నిలవడానికి ఈ ఏర్పాటు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
రాజకీయాల్లోకి రాకముందే ప్రజలతో నేరుగా మమేకం కావాలని ధనుష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే ఈ సేవా కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఒకవైపు అభిమానులను సేవా మార్గంలో నడిపిస్తూనే, మరోవైపు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ న్యాయ సలహాదారుల నియామకం ఆయన భవిష్యత్ రాజకీయ ప్రణాళికల్లో కీలక ముందడుగుగా కనిపిస్తోంది.

