పులివెందుల ఎన్నికల్లో రిగ్గింగ్: చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పులివెందులలోని పోలింగ్ కేంద్రాలను ఉదయం 4 గంటల నుంచే టీడీపీ వర్గాలు ఆక్రమించుకున్నాయని ఆయన ఆరోపించారు. మొత్తం 80 పోలింగ్ బూత్‌లలో దాదాపు 70 చోట్ల వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మీ ఓటు ముందే పడిపోయిందని చెబుతూ ఓటర్ల స్లిప్పులను బలవంతంగా లాక్కుని వెనక్కి పంపుతున్నారని ధ్వజమెత్తారు.

అధికార పార్టీ అక్రమాలకు పోలీసులే ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ తరఫు బరిలో ఉన్న అభ్యర్థి ప్రమీలమ్మపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. పలువురు కౌన్సిలర్ అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.

ఈ అక్రమాలను చిత్రీకరిస్తున్న ఎన్‌టీవీ, ఇండియా టుడే మీడియా ప్రతినిధులపై దాడులు జరిగాయని చెప్పారు. వారి కెమెరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. పులివెందులతో పాటు జమ్మలమడుగు, చిత్తూరు, మాచర్ల, తాడిపత్రి, మదనపల్లె ప్రాంతాల్లోనూ ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వడం లేదని దుయ్యబట్టారు.

పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, సమగ్ర పర్యవేక్షణలో రీపోలింగ్ నిర్వహించాలని రిటర్నింగ్ అధికారిని డిమాండ్ చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కోల్పోయారని ఆయన విమర్శించారు.