ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

ఈ వ్యవహారంలో బాధితుడైన చక్రధర్‌గౌడ్ గతంలో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2023 ఎన్నికల సమయంలో తన వ్యక్తిగత ఫోన్‌తో పాటు తన భార్య ఫోన్‌ను కూడా అక్రమంగా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తమ కదలికలపై నిఘా ఉంచి తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తొలుత జీరో ఎఫ్‌ఐఆర్‌గా ఈ వ్యవహారం నమోదైంది. అనంతరం విచారణ నిమిత్తం ఈ కేసును సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

తాజాగా సిద్దిపేట పోలీసులు ఈ అంశంపై అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పంజాగుట్టలో నమోదైన ప్రాథమిక వివరాలకు తోడు పలు అదనపు చట్టపరమైన సెక్షన్లను కూడా ఈ కేసులో చేర్చారు.రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పటికే పలువురు ఉన్నత పోలీసు అధికారుల అరెస్టులకు దారితీసింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న కీలక నేతల ఆదేశాలతోనే ఈ వ్యవహారం నడిచిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు నేరుగా మాజీ మంత్రి హరీశ్‌రావుపైనే కేసు నమోదు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ కేసు విచారణను పోలీసులు మరింత వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది.