తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల అధికారులను కోరారు. నవంబర్ 6తో ముగియనున్న గడువును నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేయగా, అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆమె వెల్లడించారు. నవంబర్ 21 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో, అర్హులైన పట్టభద్రులందరూ పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆరు పాత జిల్లాల పరిధిలో జరగనున్న ఈ ఎన్నికల్లో విద్యావంతులు, ముఖ్యంగా జెన్జీ యువత తమ వివేచనతో ఓటు వేయాలని కోరారు.
ఈ ఎన్నికల్లో బీసీ వర్గాలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు గొగికర్ నవీన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానం నుంచి ఆకాశ్ కొల్లూరు, వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానం నుంచి నలమాస శ్రీకాంత్ గౌడ్ బరిలో నిలుస్తారని ప్రకటించారు. నిరుద్యోగ సమస్యలు, విద్యారంగ అభివృద్ధి, బీసీల ప్రాతినిధ్యమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వస్తున్నందున అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన రోడ్లు, మెరుగైన పారిశుధ్యం, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

