రాధికా ఆప్టే వ్యాఖ్యలకు ఎస్కేఎన్ కౌంటర్!

దక్షిణాది చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో ఆమె నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాలో కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో ఆమె పాత్ర, కథాంశంపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. వరుసకు మామ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకునే సన్నివేశం తనను ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. రొమాన్స్ సీన్లు నచ్చలేదని, పాత్రను మధ్యలోనే ముగించారని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. దక్షిణాదిలో అవకాశాలు దక్కించుకుని పేరు తెచ్చుకున్న తర్వాత కొందరు నటీనటులు పరిశ్రమను కించపరచడం అలవాటుగా మార్చుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నటులకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుందని, కానీ అన్నం పెట్టిన పరిశ్రమపై విద్వేషం చూపించడం సరికాదని ఆయన హితవు పలికారు.

దక్షిణాది సినిమాల్లో స్థానిక కథలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని ఎస్కేఎన్ స్పష్టం చేశారు. బయటి ప్రాంతాల వారికి అవి భిన్నంగా అనిపించవచ్చని, కానీ స్థానిక ప్రజలకు అవి ఎంతో సుపరిచితమని తెలిపారు. చిత్ర పరిశ్రమలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. అవకాశాలు ఉన్నప్పుడు అంగీకరించి, గుర్తింపు పొందాక కథలను, సంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని విమర్శించారు.

గతంలో కూడా పలువురు ఉత్తరాది నటీమణులు దక్షిణాదిలో స్టార్‌డమ్ సంపాదించి, ఆపై బాలీవుడ్ వేదికలపై సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై గతంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు రాధికా ఆప్టే వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను మీరూ గౌరవించడం నేర్చుకోవాలని నిర్మాత ఎస్కేఎన్ సూచించారు.