వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన చారిత్రక ప్రజాసంకల్ప యాత్ర నవంబర్ 6 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా, ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 2017 నవంబర్ 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఈ యాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల గుండా ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగింది.
ఈ యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కోట్లాది మంది ప్రజలను నేరుగా కలిశారు. వారి కష్టాలను, ఆవేదనలను స్వయంగా విన్నారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా నిరంతరం ప్రజల మధ్యే నడిచారు. ‘నేను ఉన్నాను, నేను విన్నాంటూ’ ప్రతి ఒక్కరికీ గుండెధైర్యం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాల్లో నెలకొన్న ఆర్థిక, సామాజిక సమస్యలను ఆయన కళ్లారా చూశారు.
ఈ పాదయాత్ర మొత్తం 134 అసెంబ్లీ నియోజకవర్గాలను తాకింది. అలాగే 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగింది. సుమారు 341 రోజుల పాటు కొనసాగిన ఈ మహా యాత్రలో వైఎస్ జగన్ మొత్తం 3,648 కిలోమీటర్ల మేర నడిచారు. దారి పొడవునా 124 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అలాగే 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు.
చదువు, వైద్యం కోసం పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైఎస్ జగన్ ప్రత్యక్షంగా చూశారు. సరైన ఉపాధి లేక పేద కుటుంబాలు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిని గమనించారు. మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దగ్గర నుంచి తెలుసుకున్నారు. చిన్న చిన్న పనుల కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు, ప్రజలు తిరగాల్సిన అవస్థలను ఆయన పరిశీలించారు. ప్రజల కష్టాలను పూర్తిగా అవగతం చేసుకున్నారు.
ప్రజల కష్టాలను పూర్తిగా అర్థం చేసుకున్న వైఎస్ జగన్, 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా వివక్ష లేని ప్రజా సంక్షేమ పాలనను అందించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకే నేరుగా చేర్చారు.
ఈ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి పాలనా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ బలోపేతం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంగ్లీష్ మీడియం విద్య వంటి అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పల్లెసీమలకు కొత్త కళను తెచ్చారు.
అయితే 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు కావడం లేదని, ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజల గొంతుకై నిలబడాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చే ఏడాది మళ్లీ పాదయాత్ర చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజల హక్కుల సాధనే ధ్యేయంగా ఆయన అడుగులు ముందుకు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల ప్రజాసంకల్ప యాత్ర జ్ఞాపకాలు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ సందర్భాన్ని ఘనంగా స్మరించుకుంటున్నారు. నాటి పాదయాత్ర అందించిన స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని నాయకులు సంకల్పించారు.

