ముక్కలుగా నరికి పడేశా… సంచలన వాంగ్మూలం!

అమెరికాలోని వర్జీనియా కోర్టులో ఒక సంచలన ఘటన వెలుగు చూసింది. భార్యను హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన ఎన్‌ఆర్‌ఐ భర్త నరేష్ భట్ కోర్టులో సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తన భార్య మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అతను అంగీకరించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

2024లో 28 ఏళ్ల మమతా కఫ్లే భట్ అదృశ్యమయ్యారు. చివరిసారిగా ఆమె జూలై 29న వీడియో కాల్‌లో కనిపించారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన మమత హత్య కేసులో భర్త నరేష్ భట్ విచారణ ఎదుర్కొంటున్నాడు. తొలుత తన భార్య ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, కోర్టు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

కోర్టులో నరేష్ సాక్ష్యం ప్రకారం.. జూలై 29న రాత్రి నిద్రపోవడానికి వెళ్లగా, ఉదయం లేచేసరికి మమత మంచం కింద చనిపోయి ఉందని తెలిపాడు. ఆమె పక్కనే పురుగుల మందు ప్యాకెట్ పడి ఉందన్నారు. ఆమె మరణం తర్వాత భయంతో ఏం చేయాలో తోచలేదని చెప్పాడు. పోటోమాక్ నదిలో పడేయాలని భావించి, ఆ తర్వాత హోమ్ డిపో నుంచి రంపం తెచ్చినట్లు తెలిపాడు.

చెత్తబుట్టలో బాడీ సరిపోదని భావించి, రంపంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికానని నరేష్ తెలిపాడు. ఆ తర్వాత వాటిని ప్లాస్టిక్ కవర్లలో ఉచ్చి చెత్తలో పడేసినట్లు వెల్లడించాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, కానీ ఆ పని చేయలేకపోయానని పేర్కొన్నాడు. భయందోళనల కారణంగా పోలీసులకు వెంటనే ఫోన్ చేయలేకపోయానని వాంగ్మూలం ఇచ్చాడు.

ఈ కేసులో నరేష్ భట్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. కేవలం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున, నేరాన్ని ఒప్పుకోవడం ద్వారా శిక్ష తగ్గించుకోవడానికి భట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.