ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 76 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. ప్రధానంగా అధికార కూటమిలోని పార్టీల మధ్య తలెత్తిన సమన్వయ లోపమే వైకాపా విజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తెదేపా, జనసేన, భాజపా పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సఖ్యత కొరవడటంతో వైకాపాకు ఊహించని లాభం చేకూరింది.
ఈ ఎన్నికల్లో వైకాపా గెలుచుకున్న స్థానాల్లో తెలుగుదేశం పార్టీపై 43 చోట్ల, జనసేనపై 24 చోట్ల, భాజపాపై 9 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్య్రర్థులపై వ్యతిరేకత ఉండటం, రెబల్స్ బరిలో నిలవడం, భారీగా క్రాస్ ఓటింగ్ జరగడం వంటి పరిణామాలు కూటమికి నష్టం చేకూర్చాయి. క్షేత్రస్థాయిలో మూడు పార్టీల శ్రేణులు కలిసి పనిచేయకపోవడం వల్ల అనేక చోట్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
వైకాపా గెలుపొందిన స్థానాల్లో ఆ పార్టీ స్వశక్తితో గెలుచుకున్నవి కేవలం పది నుంచి పదిహేను మాత్రమేనని తెలుస్తోంది. మిగిలిన స్థానాలన్నింటిలోనూ కూటమి పార్టీల వైఫల్యాలే వైకాపా విజయ మార్గాన్ని సులభతరం చేశాయి. శ్రీసత్యసాయి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో కూటమిలోని అంతర్గత విభేదాలు వైకాపాకు అనుకూలంగా మారాయి. స్థానిక నాయకుల ఉదాసీనత కూడా ఓటమికి ఒక కారణమని సమాచారం.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో వైకాపా తన పట్టును నిరూపించుకుంది. కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, చంద్రగిరి వంటి ప్రాంతాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల మద్దతుతో పాటు, కూటమిలో ఉన్న రెబల్ అభ్యర్థుల ప్రభావం వైకాపా విజయానికి దోహదపడింది.
మొత్తం మీద, ఈ పరిషత్ ఎన్నికల ఫలితాలు అధికార కూటమికి ఒక హెచ్చరికలాంటివని చెప్పవచ్చు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి లోపాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూటమి పార్టీ పెద్దలు భావిస్తున్నారు. సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారానే క్షేత్రస్థాయిలో పట్టును నిలుపుకోగలమని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

