9వ‌ తరగతిలో పాసైతే.. రూ.1.62 కోట్ల కారు కొనిచ్చిన నాన్న‌!

పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ్‌ బర్ధమాన్‌ జిల్లాలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కుమారుడికి ఓ తండ్రి భారీ కానుక ఇచ్చారు. కుమారుడి ప్రతిభను మెచ్చుకుంటూ ఏకంగా రూ.1.62 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా అందించారు.

ఈ జిల్లాలోని పరాజ్‌ గ్రామానికి చెందిన వ్యాపారవేత్త షంషుద్దీన్ తన కుమారుడు మహమ్మద్ తల్హా (15) కోసం ఈ ఖరీదైన కానుకను కొనుగోలు చేశారు. తల్హా తొమ్మిదో తరగతి అర్ధవార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే లగ్జరీ స్పోర్ట్స్ కారు కొనిస్తానని తండ్రి గతంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఆయన వెంటనే ముంబైలోని షోరూమ్‌కు వెళ్లి కారును ఆర్డర్ చేశారు.

కుమారుడు ఎప్పటినుంచో కోరుకుంటున్న బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్‌ స్పోర్ట్స్ కారును ముంబై నుంచి ఇంటికి తెప్పించారు. ఈ లగ్జరీ కారు గ్రామానికి చేరుకోవడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. కారును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ కుటుంబం వద్ద ఇప్పటికే రేంజ్ రోవర్, వోల్వో, మర్సిడస్ బెంజ్ వంటి పలు ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లల చదువును ప్రోత్సహించడానికి తండ్రి ఇంత ఖరీదైన కానుక ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుమారుడి కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారని కొందరు ప్రశంసిస్తుంటే, టీనేజర్‌కు అంత విలువైన బహుమతి అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.