తెలంగాణ ప్రభుత్వం పేదలకు భారీ ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధిదారులు తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు సమకూర్చేది. ఇందులో ప్రభుత్వ సబ్సిడీతో పాటు లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం ఉండేవి. ఆ సమయంలో బ్యాంకు రుణాల కోసం లబ్ధిదారులు తమ ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తనఖా పెట్టేవారు.
నిబంధనల ప్రకారం లబ్ధిదారులు తమ రుణ వాయిదాలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాత ఆ పట్టాలను తిరిగి ఇచ్చేయాలి. కానీ వివిధ కారణాల వల్ల లక్షలాది మందికి చెందిన ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు తహసీల్దారు కార్యాలయాల్లోనే ఉండిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్నా అవి లబ్ధిదారుల చేతికి అందలేదు.
ఇటీవల రాష్ట్రంలో 22ఏ భూ వివాదాలకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో తహసీల్దారు కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించారు.
తహసీల్దారు కార్యాలయాల్లో ఉన్న పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తక్షణమే లబ్ధిదారులకు తిరిగి ఇచ్చేయాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం కలగనుందని మంత్రి తెలిపారు. ఏళ్ల తరబడి తమ సొంత ఇళ్ల పత్రాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది.

