అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ఒక అదిరిపోయే అప్డేట్ను అభిమానులతో పంచుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా టీజర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో అప్డేట్ కోసం డిమాండ్ చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు చిత్రబృందం ఆసక్తికరంగా స్పందించింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపింది. సీజీఐ (CGI) మరియు రీ-రికార్డింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. త్వరలోనే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించాల్సి ఉందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఇదే అప్డేట్ అని, అసలైన బ్లాస్ట్ కోసం మరికొంత కాలం వేచి చూడాలని మేకర్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
గత ఏడాది నవంబరు 15న ఈ సినిమా టైటిల్‌తో పాటు మహేశ్‌బాబు ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇటీవల సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మేకర్స్ ఇచ్చిన ప్రకటనలో విడుదల తేదీపై ఎలాంటి మార్పులు ప్రకటించలేదు. మరోవైపు, ఈ పాన్-వరల్డ్ చిత్రాన్ని ఏకంగా 50 భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

