తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1200 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారాస ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఏనాడూ పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యులకు మాత్రం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టుకున్నారని విమర్శించారు. సిద్దిపేట వేదికగా ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ సభలో పాల్గొన్న సీఎం, రూ.544 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే, రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు.
తొలి తెలంగాణ ఉద్యమ నేత దివంగత అనంతుల మదన్మోహన్ సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్మోహన్ పేరు పెడుతూ 24 గంటల్లో జీవో విడుదల చేయాలని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆదేశించారు. 1983లో మదన్మోహన్ చేతిలో ఓడిపోయిన కేసీఆర్, ఆ తర్వాత రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల నాటికి హరీశ్‌రావు భారాస పార్టీలో ఉండరని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భాజపాతో రహస్య మంతనాలు జరుపుతున్నారని, మామ కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాణ్యత లేకుండా కట్టడం వల్లే అది మూడేళ్లలోనే కూలిపోయిందని విమర్శించారు. అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఆయనకు నీటిపారుదల శాఖ ఇవ్వలేదని గుర్తు చేశారు.
తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను వేదికపైకి పిలిచి సీఎం గౌరవించారు. గత ప్రభుత్వం ఆమెను నిర్లక్ష్యం చేస్తే, తమ ప్రభుత్వం మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించి గౌరవించిందని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టి దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్, హరీశ్‌రావు మరణశాసనం రాశారని మండిపడ్డారు. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2034 వరకు అధికారంలో ఉంటుందని, సిద్దిపేటలోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

