భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక ‘టైమ్’ మేగజైన్ విడుదల చేసిన ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. వివిధ రంగాలలో దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ మార్పు తీసుకొస్తున్న 100 మంది అసాధారణ నాయకులు, ప్రతిభావంతులతో ఈ జాబితాను రూపొందించారు. భారత్‌లో ఈ తరహా ప్రత్యేక జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో మొత్తం తొమ్మిది మంది భారత క్రీడాకారులకు స్థానం లభించింది. వైభవ్‌తో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఒలింపిక్ పతక విజేతలు లవ్లీనా బోర్గోహెయిన్, మీరాబాయి చాను ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, అథ్లెట్ విద్య రామరాజ్, ఆర్చర్ కుమ్కుమ్ మొహోద్, హాకీ మాజీ గోల్ కీపర్ సవితా పూనియా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు.
టైమ్ జాబితాలో చోటు సంపాదించిన వైభవ్ సూర్యవంశీపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రశంసల వర్షం కురిపించాడు. మారుతున్న నవ భారత్‌కు వైభవ్ ఒక ప్రతీక అని ఆయుష్మాన్ అభివర్ణించాడు. మైదానంలో క్రికెట్ బ్యాట్‌తో ఆడుతున్నప్పుడు విభిన్నంగా ఆలోచించే వారిదే భవిష్యత్తు అని వైభవ్ నిరూపిస్తున్నాడని కొనియాడాడు.
చిన్న వయసులోనే వైభవ్ సాధించిన ఈ విజయం ఎంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో భారత క్రికెట్ జట్టులో వైభవ్ మరింత కీలక పాత్ర పోషిస్తాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అరుదైన గౌరవంపై అభిమానులు, క్రీడా ప్రముఖులు వైభవ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

