హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసం ఎదుట ఓ బిల్డర్ కత్తితో వీరంగం సృష్టించాడు. అక్కడి బౌన్సర్లపై దాడికి యత్నించడంతో పాటు తన ఛాతీ, చేతులపై కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పోలీసుల కథనం ప్రకారం, ఖమ్మంలోని గణేశ్ టౌన్‌షిప్‌కు చెందిన భట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ అనే బిల్డర్ బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 35లోని పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. పవన్‌ను కలవాలంటూ ఒక ఫ్లెక్సీ పట్టుకుని పట్టుబట్టాడు. తాను తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయానని, వాటిని తీర్చేందుకు ఆర్థిక సాయం అందించాలని వేడుకున్నాడు.
పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు గత 16 రోజులుగా ఖమ్మం, మంగళగిరి, హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ తాను పడుతున్న కష్టాలను ఆ ఫ్లెక్సీపై వివరించాడు. తన సమస్యను నేరుగా చెప్పుకోవడానికి కొన్ని నిమిషాలు సమయం ఇవ్వాలని కోరాడు.
ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్లను కత్తితో బెదిరిస్తూ వారిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన బౌన్సర్లు వెంటనే అతడి నుంచి కత్తిని లాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సుచేతన్ ఠాకూర్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పిలిపించి, వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి సుచేతన్ను వారికి అప్పగించారు.

