దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు దిల్లీలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న యువతిపై తోటి ఉద్యోగులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేఫ్‌లో పనిచేస్తున్న ఎనిమిది మంది సోమవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగిసిన తర్వాత కేఫ్ మూసివేశారు. అయితే ఒక ఉద్యోగి వద్ద తాళాలు ఉండటంతో వారంతా మళ్లీ లోపలికి వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే కూర్చుని మద్యం సేవించారు.
ఆ సమయంలో ఇద్దరు సహోద్యోగులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. మిగిలిన వారు వారికి పూర్తిగా సహకరించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మంగళవారం తెల్లవారుజామున బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. పార్టీ అనంతరం బాధితురాలు తన స్నేహితుడు, ఇద్దరు మహిళలతో కలిసి కేఫ్ నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానుష ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

