వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రతి పక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. రాజకీయాలకు గుడ్ బై అని.. పార్టీ పదవులకు రాజీనామా అని నేతలు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. తాజాగా, ఆదివారం కోలగట్ల వీరభద్ర రావు విజయనగరం ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ఇప్పటికే రెండు షాక్‌లు తగిలాయి. కోలగట్ల వీరభద్ర రావు నియోజకవర్గంలో అంతర్గత కలహాలతోనే ఇంచార్జ్ పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఏకంగా జగన్‌కే తెలియజేశారు. పాదయాత్ర నాటికి ఇంకెన్ని వికెట్లు పడిపోతాయోనన్న బెంగ వైసిపి సీనియర్లకు పట్టుకుందని అంటున్నారు. బొత్స తీరుపై కోలగట్ల చాలా కాలం నుంచి మనస్తాపంతో ఉన్నారు. ఆయన వైసిపిలో చేరినప్పుడే పార్టీని వదిలేసి, టిడిపిలో చేరడానికి అంతా సిద్దం చేసుకున్నారనే ప్రచారం సాగింది. కానీ జగన్ జోక్యం కారణంగా కోలగట్ల మెత్తబడ్డారు.
ప్రకాశం జిల్లాలో ఇప్పటికే అద్దంకి, కందుకూరు, గిద్దలూరు, యర్రగొండపాలెం శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, ముత్తుముల అశోక్ రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. అందులో అద్దంకి, గిద్దలూరు, కందుకూరుల్లో దీటైన నేతలు దొరక్క వైసిపి నాయకత్వం సతమతమవుతోంది. మరి ఇలాంటి సమయంలో జగన్ పార్టీని ముందుకు ఎలా నడుపుతారో చూడాలి.