కుల సమీకరణాల సర్వే…… 2019 విజేత ఎవరంటే?

మన నాయకులందరూ కూడా కుల రాజకీయాలు ఇష్టం లేదనే చెప్తారు. ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న పవన్ కళ్యాణ్ అయితే కులం అంటగడితే కొడతాను అనే రేంజ్‌లో మాట్లాడతాడు. ఇక చంద్రబాబు కూడా ‘కమ్మ’ని అభిమానాలు ఏమీ లేవని సమయం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాడు. అయితే అనంతపురానికి బెంగుళూరు, హైదరాబాద్ కంటే దూరం అయిన అమరావతిని రాజధానిగా ఎందుకు ఎంపిక చేశావయ్యా అంటే మాత్రం సమాధానం ఉండదు. అలానే ఉంటుంది మన నాయకుల తీరు. ఇక ప్రజల్లో కూడా కుల సమీకరణాల ప్రభావం మామూలుగా ఉండదు. రెడ్డి కులస్థుల్లో ఎక్కువమంది జగన్‌కి మద్దతిస్తున్నారన్న మాట నిజం. ఇక చంద్రబాబు కమ్మల కోసం…కమ్మల మద్దతుతోనే నాయకుడిగా చెలామణి అవుతున్నాడన్నది నిజం. మీడియాలోనూ, సినిమా ఫీల్డ్‌లోనూ, పాలిటిక్స్‌లోనూ, బిజినెస్‌లోనూ ఉన్న కమ్మల్లో చాలా మంది వారి వారి ప్రయోజనాల కోసం బాబును గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ని దేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతి రాష్ట్రంగా చంద్రబాబు నిలబెట్టాడన్న అపవాదును బాబు మూటగట్టుకోవడానికి కారణం కూడా తాను అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళతో పాటు బాబు, లోకేష్‌ల అవినీతి ఒక స్థాయిలో పెచ్చరిల్లడమే. ఇక పవన్ కూడా తాజాగా కుల రాజకీయాలు బాగానే ఒంటపట్టించుకున్నాడు. కర్ణాటక ఎన్నికల తర్వాత నుంచీ మొత్తం రాష్ట్రం కంటే తన వర్గం జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రపై ఎక్కువ దృష్టిసారిస్తున్నాడు పవన్.

ఆ మధ్య అనంతపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్……తాను చేయించుకున్న సొంత సర్వేల్లోనే ఓడిపోయే అవకాశం ఉంది అని తేలడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తాను అని మాట మార్చేశాడు. సో….పవన్ టార్గెట్ మొత్తం కాపులే అని అనడంలో సందేహం లేదు. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా మద్దతివ్వడమే కాకుండా కాపుల చేత కూడా చంద్రబాబుకు మద్దతు ఇప్పించిన పవన్ ఈ సారి 2019 ఎన్నికల్లో మాత్రం బాబు ఓట్లను పూర్తిగా లాగేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బ్రాహ్మణులను కూడా పూర్తిగా దూరం చేసుకున్నాడు చంద్రబాబు. ఫైనల్‌గా చంద్రబాబుకు మిగిలేది బీసీలు, బాబు సొంత కులస్తులే.

ఇక వైఎస్ జగన్‌కి రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మస్లిముల మద్దతు బలంగా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్‌కి మద్దతివ్వాలని తాజాగా బ్రాహ్మణులందరూ నిర్ణయం తీసేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ ఛీఫ్‌గా ఉన్న బీసీ నాయకుడు రఘువీరారెడ్డి కూడా వైకాపాలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సారి బీసీల్లో కూడా జగన్ పట్టు పెరిగే అవకాశం ఉందని తాజా సర్వే తేల్చిచెప్తోంది. ఈ నేపథ్యంలో కేవలం సొంత కులంతో పాటు బీసీలను నమ్ముకుని రంగంలోకి దిగుతున్న చంద్రబాబు, కాపులకు మాత్రమే నాయకుడిగా నిలబడిపోయే అవకాశమున్న పవన్ కంటే రెడ్లతో పాటు ఎస్సీ, ఎస్టీలు, ముస్లిముల్లో ఎక్కువ శాతం ఓట్లు కొల్లగొట్టడంతో పాటు బీసీలు, కాపుల ఓట్లు కూడా ఎంతో కొంత తనవైపుకు తిప్పుకోగలిగే అవకాశం ఉన్న జగన్‌ని ఎదుర్కోవడం బాబు, పవన్‌లకు ఈ సారి అసాధ్యం అని ఈ కులసమీకరణాల సర్వే చెప్తోంది. 2019లో జగన్ గెలవడం ఖాయమని చెప్పి సీనియర్ జర్నలిస్టులు చేపట్టిన కుల సమీకరణాల సర్వేలో తేలిన విషయాలు ఇఫ్పుడు జర్నలిస్ట్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.