ఇండోనేషియాను వ‌ణికించిన సునామీ….వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృతి

ప్ర‌కృతి విల‌యానికి ఇండోనేషియా చిగురుటాకులా వ‌ణికిపోయింది. సుమత్రా, జావా ద్వీపాలపై సునామీ విరుచుకుప‌డింది. భారీగా ఆస్తి, ప్రాణ న‌ష్టాన్నిమిగిల్చిచింది.అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ధ‌ల‌వ్వ‌డంతో విరుచుకు ప‌డిన సునీమీకి 281 మంది ప్రాణాలు కోల్పోయారు.

దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మరో 28 మంది గల్లంతయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పిల్ల క్రాకటోవాగా పిలిచే ఈ అగ్నిపర్వతం శనివారం రాత్రి 9 గంటల సమయంలో బద్దలైంది. సరిగ్గా అర గంట తర్వాత సముద్రం లోపల భూమి కంపించి భారీ సునామీ సంభవించింది.

సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా పశ్చిమ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించింది. వారాంతం కావడంతో క్షణాల్లో బీచ్‌లు మృత్యుదిబ్బలుగా మారాయి. వేలాది చెట్లు సునామీ కూకటివేళ్లతో సహా పెకిలించింది. సునామీ ధాటికి సుమత్రా, జావా దీవుల మధ్య ఉన్న సుండా జలసంధి కూడా దెబ్బ‌తినింది.

ఈ అగ్నిపర్వతం నుంచి ఇటీవల కాలంలో శబ్దాలు, విస్పోటాలు ఎక్కువయ్యాయి. అయితే ఎప్పటి నుంచో ఇవి సర్వసాధారణంగా మారడంతో స్థానికులు పట్టించుకోవడం మానేశారు. శనివారం కూడా పెద్ద విస్పోటం ఏమీ లేకుండా అగ్నిపర్వతం బద్దలు కావడంతో ప్రజలు అప్రమత్తం కాలేకపోయారు. అగ్నిపర్వత భాగం సముద్రంలో కుప్పకూలడంతో నీరు స్థానభ్రంశం చెంది గంటకు 640 నుంచి 960 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకువచ్చి విల‌యం సృష్టించింది.

అగ్నిపర్వతం బద్దలై పర్వతంలోని ఒక భాగం కుప్పకూలి ఆ శకలాలు సముద్రంలో పడితే అకస్మాత్తుగా నీరు స్థానభ్రంశం చెంది సునామీకి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.