విజ‌య నిర్మ‌ల మృతికి సంతాపం తెలిపిన సీఎం జ‌గ‌న్, మాజీ సీఎం చంద్ర‌బాబు

విజయ నిర్మలగారి ఆకస్మిక మరణం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి, మేటి దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన విజయ నిర్మలగారి మరణం పరిశ్రమకు తీరని లోటన్న ఆయన ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

విజయనిర్మల కుటుంబానికి సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు.. రోజు మొత్తం అభిమానుల సందర్శన కోసం పార్థివదేహాన్ని అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలిం ఛాంబర్ కి తరలిస్తారు. ఆ తరువాత ఆమెకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.