ఎస్ ఎస్ రాజమౌళి సినిమా మొదలు అయిందంటే చాలు.. ఆ సినిమాపై క్రేజ్ ఏ రెంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. దేశ వ్యాప్తంగా RRR సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు గా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా అజయ్ దేవగణ్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ యొధుల జీవితాలను ప్రేరణగా తీసుకుని ఒక ఫిక్షనల్ కథను తయారు చేశారు. ఈ ఇద్దరు యోధులకు శిక్షణ ఇచ్చే గురువు, మార్గదర్శకుడి పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ బ్రిటిష్ వారితో పోరాటం జరిపే రెండు సీక్వేన్సులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని.. అజయ్ పోరాటం స్వయంగా చూసి స్పూర్తి పొందిన తారక్, చరణ్ లు బ్రిటిష్ వారిపై తమదైన శైలిలో పోరాడేందుకు రెడీ అవుతారని అంటున్నారు.
ఈ చిత్రంలో అజయ్ పాత్ర కల్పితమైనది.. కానీ చాలా కీలకైనదని తెలుస్తోంది. స్క్రీన్ టైం ఎక్కువ కాకపోయినప్పటికి ప్రేక్షకులను ఉన్నంతసేపు థ్రిల్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నార్త్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్న మొదటి బాలీవుడ్ స్టార్ అజయ్ కాబట్టి పవర్ ఫుల్ పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమే.