నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి కి ప్రముఖుల నివాళి..!!

నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ రోజు ఉదయం గుండెపోటు తో మరణించిన సంగతి అందరికి తెలిసిందే.. ఎన్ని తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన అయన మరణానికి టాలీవుడ్ దిగ్భ్రాంతి తెలియజేసింది. ఆయన మరణం పట్ల అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు నివాళులు అర్పించారు. మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.అటు, ఏపీ సీఎం స్పందిస్తూ జయప్రకాశ్ రెడ్డి మూడు దశాబ్దాల సినీ జీవితంలో వైవిధ్యమైన పాత్రలు, తనదైన విలక్షణ నటనతో చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల సినీ ప్రముఖులే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. జయప్రకాశ్ రెడ్డి గారు తనదైన నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారని, వారి మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాశ్ రెడ్డి గారి అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం అని కీర్తించారు.

మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని చెప్పారు. ఆయనతో కలిసి తాను చివరిసారిగా ‘ఖైదీ నెంబర్ 150’లో నటించానని తెలిపారు. గొప్ప నటుడని కితాబిచ్చారు. ఇదే క్రమంలో స్టార్ హీరో మహేష్ బాబు సంతాపాన్ని తెలిపారు… ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.