‘శ్రీమంతుడు’ సినిమా ప్రమోషన్ ఇంకా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే సినిమా విడుదలై పది రోజులు గడిచిపోయినా.. హీరో మహేశ్ బాబు ఇంకా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
హైదరాబాద్ లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాలు పంచుకొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. మరి సినిమా విడుదల అయ్యాకా హీరోలు రెండు మూడురోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వడమే ఎక్కువ. పెద్ద హీరోల తీరు అలానే ఉంటుంది. అయితే మహేశ్ మాత్రం ఇంతలా శ్రద్ద చూపుతుండటం వెనుక ఆసక్తికరమైన రీజనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇంతకీ కథేమిటంటే.. ‘శ్రీమంతుడు’ సినిమాకు మహేశ్ బాబు సహ నిర్మాతగా ఉన్నాడు,. “ఎమ్ బీ’ బ్యానర్ ద్వారా మహేశ్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకొన్నాడు. ఇంతకు ముందు ప్రిన్స్ సినిమాను ఆయన అన్నయ్య రమేశ్ బాబు, అక్క మంజులలు నిర్మించే వాళ్లు. ఇప్పుడు మాత్రం ఆయనే స్వయంగా రంగంలోకి దిగాడు. మరి మహేశ్ ‘శ్రీముంతుడు’ సినిమాను ఇంతగా ప్రమోట్ చేయడం వెనుక రీజన్ అదే అని తెలుస్తోంది.
సొంతంగా నిర్మాత కాబట్టి.. సినిమా ఎక్కువ వసూళ్లు సాధించాలనే టార్గెట్ తో మహేశ్ ఇంతలా ఈ సినిమా తరపున కష్టపడుతున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని.. మహేశ్ బాబు తన సినిమాలన్నింటినీ ఇలాగే ప్రమోట్ చేస్తాడని.. ఇప్పుడు కొత్తగా స్వార్థం ఏమి లేదని ఆయన అభిమానులు అంటున్నారు.