టాలీవుడ్ లోసంచలనంగా మారిన శ్రీ రెడ్డి వ్యవహారంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుసరించిన వ్యవహార శైలిపై హీరో మంచు విష్ణు మండిపడ్డారు. నటి శ్రీరెడ్డి వివాదంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనుసరించిన విధానం, వ్యవహార శైలిపై హీరో మంచు విష్ణు నిప్పులు చెరిగారు. ‘మా’ తీరు తనను మనసును తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని సభ్యుల సంక్షేమం కోసమే ఈ అసోసియేషన్ ఏర్పిడిన సంగతిని ఆయన గుర్తుచేశారు.ఈ మేరకు మా అధ్యక్షుడికి నేరుగా ఆయన ఓ లేఖ రాశారు.మాలో సభ్యత్వం లేని ఆమె(శ్రీరెడ్డి) చేసిన ఆరోపణల ఆధారంగా మీరు, కొంత మంది సభ్యులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి.. 900 సభ్యుల్లో ఏ ఒక్కరూ ఆమెతో నటించకూడదని ఆదేశించారు. మంచిది, కానీ ఆ 900 మంది సభ్యుల్లో మా నాన్న, నా తమ్ముడు, నా సోదరి, నేను ఉన్నాం? ఒక నటుడిగా, నిర్మాతగా నేను ఎవరితో నటించాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది.
నిబంధనలు మీరు పెట్టడానికి వీల్లేదు. అంతేకాకుండా, కొంత మంది వ్యక్తులపై, కుటుంబాలపై, మొత్తం సినీ పరిశ్రమపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్చర్యకరంగా మళ్లీ మీరే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఆమెపై నిషేధాన్ని ఎత్తేశారు. మీ చర్యల వల్ల దేశవ్యాప్తంగా మనమంటే చులకనభావం ఏర్పడింది’ అంటూ లేఖలో విష్ణు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్‌లకు కూడా ఆ మార్గదర్శకాలను అన్వయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మా లో సభ్యత్వం లేని చాలా మంది స్థానిక నటులు ఉన్నారని వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా? అంటూ విష్ణు నిలదీశారు.