పెద్ది…అదిరే అప్‌డేట్!

దర్శకుడు బుచిబాబు సాన రూపొందిస్తున్న ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభంకాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో గ్రామాల్లో జరిగే పోరు ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓ భారీ గ్రామాన్ని ప్రతిబింబించే సెట్‌ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయిందని, ఈ కొత్త షెడ్యూల్ ద్వారా చాలా ముఖ్యమైన భాగం పూర్తి చేయనున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శకుడు బుచిబాబు సాన కలిసి ఉన్న ఒక ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రమాణాల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించనుండగా జాన్వి కపూర్ కథానాయికగా శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారతదేశంలోని టాప్ సినిమాటోగ్రాఫర్‌లలో ఒకరైన ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నేషనల్ అవార్డు విజేత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల కానుంది.