జగన్ ఆఫర్‌ని తిరస్కరించిన రకుల్!

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లి తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించారు రకుల్. బాలీవుడ్‌లోనూ అడపదడప అవకాశాలే వస్తుండగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆమె తన వివాహ జీవితం, సినీ ప్రయాణం గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇక తన కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. నా కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించాను. ఆ సమయంలోనే కన్నడ ఇండస్ట్రీలో నా తొలి సినిమా అవకాశం వచ్చింది అని తెలిపారు. అప్పటివరకు తాను దక్షిణాది సినిమాలను పెద్దగా చూసే అవకాశం లేకపోయింది, అందుకే నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే, ఆ సినిమా యూనిట్ నా తండ్రిని సంప్రదించి వివరాలు చెప్పడంతో అంగీకరించాను అని చెప్పారు.

ఆ సినిమా నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది, కానీ చదువులు, నటన రెండూ బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపించి, అప్పట్లో సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని చెప్పింది. తన మొదటి సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ తనను సంప్రదించిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆయన నన్ను ఒక సినిమాలో నటించమని అడిగారు. కానీ, ఆ ప్రాజెక్ట్ కోసం 70 రోజులు కేటాయించాలి అన్నారు. అప్పట్లో నేను ఇంకా చదువుల మీద దృష్టి పెట్టినందువల్ల, కేవలం నాలుగు రోజులు మాత్రమే కేటాయించగలనని చెప్పాను. ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ఇదే కాదు, నా కెరీర్ ప్రారంభంలోనే అనేక మంచి అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది అని రకుల్ వెల్లడించింది.